కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఇటీవల చిదంబరంతో పాటు.. కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ ఆకస్మిక సోదాలు చేసిన విషయం తెల్సిందే. ఈ సోదాల తర్వాత కార్తీ చిదంబరం లండన్‌కు వెళ్లడం ఇపుడు చర్చనీయాంశంగా అనేక అనుమానాలకు తావిస్తోంది.
స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి నేతృత్వంలోని ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఎఫ్ఐపీబీ అనుమతులు ఇచ్చేందుకు... చిదంబరం, కార్తీ భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణగా ఉంది. ఇప్పటికే కార్తీ, ముఖర్జియాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అలాగే, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ సంస్థల నుంచి ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఇందులోభాగంగానే గత రెండు రోజుల క్రితం చిదంబరంతో పాటు కార్తీ నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కార్తీ హుటాహుటిన లండన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే, కార్తీ చిదంబరం లండన్ పర్యటన ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకున్నది కాదనీ.. ముందుగా చేసుకున్నషెడ్యూల్ ప్రకారమే ఆయన బ్రిటన్ వెళ్లారని చిదంబరం వివరణ ఇచ్చారు. కార్తీ విదేశీ ప్రయాణంపై నిషేధం లేదన్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన మళ్లీ స్వదేశానికి తిరిగివస్తారని వెల్లడించారు.