మధ్యప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నరుగా రాజీవ్ మహర్షి?

ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:11 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నరుగా రాజీవ్ మహర్షిని కేంద్రం నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌ (కాగ్)గా కూడా పని చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ గవర్నర్‌ లాల్జీ టాండన్ మృతి చెందారు. దీంతో ఆ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. అందుకే మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మహర్షిని నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
 
ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా కుదరని పక్షంలో మహర్షిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా ఉన్న బైజల్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పంపిస్తారని తెలుస్తోంది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌గా రాజీవ్ మహర్షి శుక్రవారమే పదవీ విరమణ పొందారు. 
 
వీరి స్థానంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన గిరీశ్ చంద్ర ముర్ము కాగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ మహర్షి 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా, హోంశాఖ కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుల్లో మహర్షి ఒకరు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు