ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి ప్రకటించారు. కావేరి మండలి ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈపరిస్థితుల్లో.. టీడీపీ ముందుకుతెచ్చిన అవిశ్వాస తీర్మానానికి అన్నాడీఎంకే మద్దతివ్వక తప్పదని వ్యాఖ్యానించారు.
దీంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీ పళనిస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే తనపై వేటు వేయడాన్ని కేసీ పళనిస్వామి గర్హించారు.
ముఖ్యమంత్రి ఈపీఎస్, ఉపముఖ్యమంత్రి ఓపీఎస్‌ల బండారం శనివారం బయటపెడతానని హెచ్చరించారు. పార్టీలో చీలిక రాబోతుందంటూ.. అధికార పక్షంలో కలకలం రేపారు. నిజానికి, కేసీ పళనిస్వామి అన్నాడీఎంకేలో సీనియర్ నాయకుడు. ఎంజీఆర్ హయాం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు.