అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వున్న చిన్నమ్మ శశికళ మౌనవ్రతం చేస్తున్నారట. జనవరిలో శశికళ తన మౌనవ్రతాన్ని విరమిస్తారట. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే.
ఇకపోతే.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి వర్ధంతి నుంచి జైలులో వున్న చిన్నమ్మ మౌనవ్రతాన్ని చేపట్టారని టీటీవీ దినకరన్ చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను సాధించిన విజయం తరువాత, ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు వెళ్లినా ఆమె మాట్లాడలేదన్నారు.
డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఎన్నికల గెలుపు విషయాన్ని చెప్పేందుకు వెళ్లిని దినకరన్‌ను కేవలం చూపులతోనే పలకరించారని తెలిపారు. దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారట.