భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి జయలలిత కన్నుమూయడంతో పన్నీర్ సెల్వం తన మంత్రివర్గ సహచరులతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ చేతిలో పెడితే కొత్తగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదన్నారు. శశికళ పార్టీ బాధ్యతలు తీసుకుంటే సీఎం పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పనిచేసే వీలు ఉండదని, ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం ఒత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. పన్నీర్ సెల్వంకు పార్టీలో పునాదిలేకపోవడంతో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీని హస్తగతం చేసుకుంటుందన్నారు.