ఎస్పీ అధినేతగా అఖిలేష్.. ములాయంకు షాక్

గురువారం, 5 అక్టోబరు 2017 (17:42 IST)
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో ఆయన్ను పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేష్‌ తండ్రి అయిన ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు. 
 
కాగా, పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఎస్పీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ తెలిపారు. అఖిలేష్‌ యాదవ్‌ నాయత్వంలోనే 2019 లోక్‌సభ, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి పదవీకాలం గతంలో మూడేళ్లు ఉండగా.. దానిని పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఐదేళ్లకు పెంచినట్లు రాంగోపాల్‌ యాదవ్‌ తెలిపారు. యూపీ ఎన్నికల సమయంలో ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సమయంలోనే ములాయంను పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఆ స్థానాన్ని అఖిలేష్‌ ఆక్రమించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి