ఉత్తరాఖండ్‌లో ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
శుక్రవారం, 5 నవంబరు 2021 (12:07 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రతిష్టించిన 12 అడుగుల ఎత్తువుండే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత విగ్రహం ముందు కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు.
పిమ్మట ఆయన మాట్లాడుతూ, ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అందరూ తిలకించారన్నారు. శంకరాచార్య భక్తులు ఈ పుణ్య స్థలంలో ఆత్మ స్వరూపంలో హాజరైయ్యారన్నారు.
దేశంలో ఉన్న అన్ని మఠాలు, జ్యోతిర్లింగ్ క్షేత్రాలు.. కేదార్‌నాథ్‌లో జరుగుతున్న శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. 2013లో వచ్చిన ఉప్పెనలో 8వ శతాబ్ధానికి చెందిన మతగురువు శంకరాచార్య సమాధి ధ్వంసమైన విషయం తెలిసిందే. అ
యితే కేదార్‌నాథ్‌ను మళ్లీ పునర్ నిర్మాణం చేపడుతారా అన్న సందేహాలు ప్రజల్లో ఉండేవని, కానీ తన మనసులో ఒక స్వరం ఎప్పుడూ కేదార్‌ను అభివృద్ధి చేయవచ్చు అని వినిపించేదని మోదీ అన్నారు. కేదార్‌నాథ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఢిల్లీ నుంచి ప్రతినిత్యం సమీక్షించినట్లు ప్రధాని వెల్లడించారు.
డ్రోన్ ఫూటేజ్ ద్వారా ఇక్కడ జరుగుతున్న అన్ని డెవలప్మెంట్ పనులను పర్యవేక్షించినట్లు ఆయన చెప్పారు. కేదార్‌లో జరుగుతున్న పనులకు సూచనలు ఇచ్చిన ఉత్తరాఖండ్‌కు చెందిన రావల్స్‌కు ప్రత్యేకంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆదిశంకరాచార్య సమాధి పున స్థాపన భారతీయ ఆధ్యాత్మిక సమృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. బాబా కేదార్ క్షేత్రం ఓ అలౌకిక అనుభూతిని కల్పిస్తుందన్నారు.
దేశంలో ఆధ్మాత్మికత, మతం అంశాలను ఓ దశలో మూసధోరణిగా భావించేవారని, కానీ భారతీయ తత్వం మానవ సంక్షేమం గురించి ఆలోచిస్తుందని, జీవితం సంపూర్ణమైందిగా భావిస్తుందని, ఈ వాస్తవాన్ని సమాజానికి తెలియజేసేందుకు ఆదిశంకరాచార్య నిరంతరం కృషి చేసినట్లు ప్రధాని మోదీ అన్నారు.
అయోధ్యలో భవ్యమైన రామాలయాన్ని నిర్మిస్తున్నామని, అక్కడ ఇటీవల వైభవంగా దీపోత్సవాన్ని చేపట్టామన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు దేశం ఉన్నత లక్ష్యాలతో ఉన్నదని, ఆ లక్ష్యాలను అందుకునేందుకు కృషి చేస్తోందని మోదీ అన్నారు. కేదార్‌నాథ్‌లో మరో 130 కోట్లకు చెందిన అభివృద్ధి పనులను కూడా మోదీ ప్రారంభించారు.