పంజాబ్ కాంగ్రెస్‌లో లుకలుకలు... ముఖ్యమంత్రిని మార్చాలంటూ..?

గురువారం, 26 ఆగస్టు 2021 (18:09 IST)
పంజాబ్ రాష్ట్రంలో అధికార పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు నాలుగున్నరేళ్ళుగా తమ ప్రభుత్వం అస్సలు పనే చేయడం లేదంటూ ముఖ్యమంత్రిని మార్చాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. 
 
రాష్ట్ర కేబినెట్‌లో భాగస్వాములైన నలుగురు కూడా ఈ డిమాండ్‌తో రోడ్డెక్కడం విచిత్రంగా కనిపిస్తోంది. చూసే వాళ్ళకు సరదాగా వుండొచ్చుగాక.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రం తలనొప్పిగా మారిందీ పొలిటికల్ డెవలప్‌మెంట్.
 
నాలుగున్నరేళ్ళుగా తమ ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు. ఈ సీఎం గద్దె దిగాలి… ఇంకో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలొస్తున్న సమయంలో ఇలాంటి విమర్శలు సాక్షాత్తు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేస్తుండడం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అసౌకర్యంగా మారింది. 
 
ఈ డిమాండ్ విపక్షాల నుంచి వినిపిస్తే.. దానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు వందిమాగధులను రెడీ చేసే వారేమో కానీ.. సొంత పార్టీకి చెందిన వారు.. అదీ ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు.. నలుగురు మంత్రులు తన ప్రభుత్వాన్ని విఫలమైన సర్కార్‌గా ప్రచారం చేస్తుండడం అమరీందర్ సింగ్‌కు ఇబ్బందికరంగా మారిపోయింది. 
 
అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 77 మంది ఎమ్మెల్యేలలో 30 మంది ఎమ్మెల్యేలు.. సీఎం గద్దె దిగాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు, పంజాబ్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తాజా అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూకూ మధ్య కొన్నాళ్ళుగా రేగుతున్న వైరానికి ఇది పరాకాష్ఠ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు