యావజ్జాతికి తిండిపెడుతున్న రైతులను ఆదుకోండి : మోహన్ భగవత్

సోమవారం, 2 అక్టోబరు 2017 (09:11 IST)
తీవ్రవాదులు, నక్సలైట్లు, గోవు స్మగ్లర్లు వంట సంఘ విద్రోహశక్తులకే యావజ్జాతికి రైతులు తిండిపెడుతున్నారనీ, వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. సంఘ్‌ వ్యవస్థాపక రోజును పురస్కరించుకుని ఆయన ప్రసంగిస్తూ... గోరక్షకులు గోసంరక్షణ పేరిట కొందరు వ్యక్తులను హత్యలు చేయడం తగదన్నారు. అలాగే ఆవుల స్మగ్లర్లు కూడా చాలా మందిని చంపారని ధ్వజమెత్తారు. 
 
గోసంరక్షణ మతాలకతీతమన్నారు. గోరక్షణలో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలే గాక పలువురు ముస్లింలు కూడా త్యాగాలు చేశారని చెప్పారు. ముఖ్యంగా, మన రైతులు వారి కుటుంబాలనే గాక యావజ్జాతికీ తిండిపెడుతున్నారు. పీకల్లోతు అప్పులతో సతమతమవుతున్నారు. ఒక్కసారి పంట నష్టపోతే అతలాకుతలమవుతున్నా రు. వారికి కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో జమ్మూకాశ్మీరు ప్రజలను మిగతా దేశంతో సంపూర్ణంగా మిళితం చేయాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ, 35ఏ అధికరణల రద్దుకు పరోక్షంగా సూచించారు. రాజ్యాంగ సవరణలతో కాశ్మీరీలను పూర్తిగా మిగతాదేశంతో కలపాలని, అప్పుడే జాతి పురోగతిలో వారికి సమాన భాగస్వామ్యం లభిస్తుందన్నారు.
 
హిందూ శరణార్థులకు స్వరాష్ట్రంలోనే పౌరసత్వ హక్కులను అక్రమంగా తిరస్కరిస్తున్నారని ఆక్షేపించారు. వారికి విద్య, ఉపాధి వంటి ప్రజాస్వామిక హక్కులు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. కాశ్మీర్లో టెర్రరిస్టులు, వేర్పాటువాదుల పట్ల కేంద్రప్రభుత్వ కఠిన వైఖరిని సమర్థించారు. మయన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యాలతో దేశభద్రతకు ముప్పుందని, అందువల్ల వారిని దేశంలోకి అడుగుపెట్టకుండా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 

వెబ్దునియా పై చదవండి