నూతన వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతు సంఘాల నాయకులతో బుధవారం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో షా నేడు సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై స్పందించే అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు నూతన చట్టాల రద్దు డిమాండ్‌తో దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన నేడు కూడా కొనసాగింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రి, చిల్లా, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు తమ నిరసన సాగిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఈ నెల 30న చర్చలు జరపుదామని కేంద్ర ప్రభుత్వం రైతులకు లేఖ రాసింది. ఇందుకు రైతు సంఘాలు కూడా అంగీకరించాయి. అయితే మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అమలుపై చర్చించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగనుండటం ఇది ఆరోసారి. ఇప్పటివరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టగా.. సవరణలు తెస్తామని కేంద్రం చెబుతోంది. మరి ఈసారైనా ప్రతిష్టంభన తొలుగుతుందో లేదో చూడాలి.