దేశ ప్రధానిగా తమిళుడు .. ఇదే నా చిరకాల కోరిక : అమిత్ షా

సోమవారం, 12 జూన్ 2023 (10:56 IST)
దేశ ప్రధాని పీఠంపై తమిళుడు ఆశీనులు కావాలన్నదే తన చిరకాల కోరిక అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వారసత్వ రాజకీయాలను నడుపుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడే 2జీ, 3జీ, 4జీ పార్టీలను ఇంటికి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఆదివారం జిల్లా కేంద్రమైన వేలూరులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, డీఎంకే 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. 2జీ అంటే 2జీ స్పెక్ట్రమ్ అవినీతి కాదని, రెండు తరాలని.. త్రీజీ అంటే మూడు తరాలని, 4జీ అంటే నాలుగు తరాలని.. తమిళనాట డీఎంకేకు చెందిన మారన్ కుటుంబీకులు రెండు తరాలపాటు అవినీతికి పాల్పడ్డారని, కరుణానిధి కుటుంబం మూడు తరాలుగా అవినీతికి పాల్పడుతోందని, కాంగ్రెస్ పార్టీ చెందిన రాహుల్ గాంధీ నాలుగో తరం కుటుంబీకుడని, నాలుగు తరాల పాటు దేశాన్ని దోచుకున్నారని విమర్శించారు. 
 
ఈ అవినీతి పార్టీలకు గుణపాఠం చెప్పి తమిళనాట భూమిపుత్రుడికి పట్టం కట్టే రోజులు చేరువలోనే ఉన్నాయన్నారు. 2004 నుండి 2014 వరకు పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్, డీఎంకే కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. 18 ఏళ్లు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే.. రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తిరుక్కురళ్‌ను 13 భారతీయ భాషల్లో అనువదించి తమిళ భాషకు పట్టం కట్టింది కూడా ప్రధాని మోడీయేనని గుర్తు చేశారు. 
 
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగో‌ల్‌ను ప్రతిష్టించి తమిళులందరినీ గర్వపడేలా చేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వమేనన్నారు. అందువల్ల ఓ తమిళుడిని ప్రధానిని చేయాలన్నదే తన చిరకాల కోరిక అని, భవిష్యత్‌తో ఓ తమిళుడిని ప్రధానిగా గెలిపిద్దామని పిలుపిచ్చారు. తమిళనాడుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్, కాంగ్రెస్ మాజీ నేత జీకే మూపనార్ ప్రధాని పదవిని చేపట్టేందుకు అవకాశాలు వచ్చినా.. డీఎంకే అడ్డుకుందని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు