భారతీయ జనతా పార్టీ జాతీయ అమిత్ షా.. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు హోం లేదా రక్షణ శాఖలలో ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆయనతోపాటు స్మృతి ఇరానీని కూడా అక్కడి నుంచి ఎంపిక చేస్తున్నారు. అమిత్‌షాను కేబినెట్‌లో చేర్చుకోడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను రాజ్యసభకు తీసుకొస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
అయితే.. ఆయన మంత్రి పదవి చేపడితే పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి రాజస్థాన్‌కు చెందిన ఓపీ మాథుర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ రేసులో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత కొత్త గవర్నర్ల నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధాని దృష్టి సారిస్తారు.
రక్షణ శాఖామంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తిరిగి గోవా సీఎంగా వెళ్లాక.. అరుణ్ జైట్లీ ఆర్థికశాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలను కూడా మోస్తున్నారు. జైట్లీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్ధన్ తమ శాఖలతో పాటు అదనంగా ఒకటి, రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వెంకయ్య కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో మంత్రివర్గంలో చాలా ఖాళీలు ఉన్నాయి.
దీంతో కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు అనివార్యమయ్యాయి. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని కేంద్రంలో కీలక మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. హోం లేదా రక్షణశాఖల్లో ఏదో ఒకటి అమిత్‌షాకు ఇచ్చి.. స్మృతి ఇరానీని సమాచార, ప్రసారశాఖ పూర్తిస్థాయి మంత్రిగానే నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం హోంశాఖామంత్రిగా రాజ్‌నాథ్ ఉన్నారు. ఈ శాఖను అమిత్ షాకు ఇస్తే రాజ్‌నాథ్ పరిస్థితి ఏంటన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈయన్ను కూడా ఏదో రీతిలో అడ్డు తొలగించుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.