అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఘనవిజయాలు సాధించినప్పటికీ, అక్కడ మాత్రం తన పప్పులింకా ఉడకనందుకు బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టికరిపించినా తనకు అత్యవసరమైన రాజ్యసభలో కావలసిన సీట్లు పెరగక పోవడం చూసి కమలనాథులు అసహనం చెందుతున్నారని సమాచారం. కీలకమైన బిల్లులపై రాజ్యసభలో ఆమోదం పొందటానికి తగినన్ని మెజారిటీ స్థానాలు దక్కాలంటే బీజేపీ మరో మూడేళ్లు వేచిచూడాల్సిందే మరి.
సరైన బలం లేక జీఎస్టీ, భూసేకరణ బిల్లు వంటి కీలకమైన సంస్కరణల అమలుకు బీజేపీ అష్టకష్టాలు పడుతోంది. అయితే తాజాగా నాలుగు రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ ఇప్పుడప్పుడే రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన భారీ విజయం రాజ్యసభలో బలం లేక ఇబ్బంది పడుతున్న ఎన్డీయేకు అనుకూలించే అంశమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేకు కావాల్సింది కూడా ఇదే.
కానీ 245 మంది సభ్యుల రాజ్యసభలో ఎన్డీయే కూటమికి నేటికీ 77 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీకి సొంతగా 56 స్థానాలున్నాయి. యుపీఏ బలం 84 కాగా కాంగ్రెస్‌కు 59 మంది సభ్యులున్నారు. మిగిలిన విపక్షాలన్నింటికి 82 సీట్లున్నాయి.
యూపీ 31 మంది ఎంపీలను అందిస్తూ మొదటి స్థానంలో నిలుస్తుంది. అయితే ఇందులో కేవలం 10 సీట్లకే 2018లో ఎన్నికలు జరగనుండగా.. మరో 10 స్థానాలకు 2020లో జరుగుతాయి. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలను యూపీ కోటాలో ఎగువసభకు పంపిన బీజేపీ.. తాజా అద్భుత విజయంతో ఈ రెండు దశల్లో (2018, 2020) ఏడేసి చొప్పున(మొత్తం 14) ఎంపీలను గెలిపించుకోగలదు.
మణిపూర్, గోవాల్లో విజయంతో 2018 కల్లా ఎన్డీయే మరో 18 సీట్లను పెంచుకుంటుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 95కు పెరగనుండగా.. కాంగ్రెస్ సంఖ్య 66కు పడిపోనుంది. మిగిలిన విపక్షాల బలం 82 నుంచి 84కు చేరనుంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో విజయంతో ఎన్డీయేకు 18 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఈ పెరుగుదల బీజేపీ రాజ్యసభ ఆశలకు ఏమాత్రం సరిపోదు.
తను అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఎన్డీయేకు మరో 30 సీట్లు అవసరం. దీంతో యూపీయేతర విపక్షాల సహాయంతోనే ఎగువసభలో నెట్టుకురావాల్సి ఉంటుంది. అయితే 2018, 2019ల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఫలితాలు భారీగా మార్పులు (ఇప్పుడున్న ప్రభుత్వాలే ఉంటాయనుకుంటే) ఉండవని భావిస్తే.. 2020నాటికి రాజ్యసభలో గరిష్టంగా (111) సీట్లు పొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సంపూర్ణమైన మెజారిటీ ఉండదు. కానీ బలమైన అధికార పక్షం కారణంగా చిన్న పార్టీల మద్దతుతో కీలక బిల్లులకు ఆమోదం పొందొచ్చు.