సౌతిండియాలో ఎక్కడైనా.. ఎపుడైనా ఉగ్రదాడి జరగొచ్చు : ఆర్మీ హెచ్చరిక

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (16:21 IST)
దక్షిణ భారతదేశంలో ఎపుడైనా, ఎక్కడైనా దాడి జరగొచ్చని ఆర్మీ హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడే అవకాశం ఉందని లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ హెచ్చరించారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని తమకు నిఘా సమాచారం అందిందని ఆర్మీ సదరన్ కమాండ్‌కు చెందిన లెఫ్లినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు. భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న సర్ క్రీక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని వెల్లడించారు. ఈ పడవుల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడివుంటారని తాము అనుమానిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఎలాంటి ఉగ్రదాడి, దుశ్చర్య జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2008, నవంబర్ 26న ఇదే తరహాలో సముద్ర మార్గం ద్వారా  ముంబైకి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు మహానగరంలో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
ఈ దుర్ఘటనలో 140 మంది భారతీయులు, 25 మంది విదేశీ పర్యాటకులతో సహా 9 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాది కసబ్‌ సజీవంగా పట్టుబడగా అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు