జల్లికట్టుకు అనుమతి లభించాలంటూ.. మధురై, అళంగానల్లూరు, చెన్నై, కోవై, తిరుచ్చి, సేలం వంటి ప్రాంతాల్లో యువత, ప్రజలు జనవరి 15వ తేదీ నుంచి ఆందోళనబాటపట్టారు. ఇలాంటి తరుణంలో శనివారం తమిళనాడు సర్కారు అవసర చట్టాన్ని తెచ్చింది. అయితే ఆందోళనకారులు అవసర చట్టం తమకు వద్దని.. జల్లికట్టుపై శాశ్వత పరిష్కారంగా ఓ చట్టాన్ని తేవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో జల్లికట్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేనకా గాంధీ జల్లికట్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేనకా గాంధీ దీనిపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయలేదని ఆమే స్వయంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజమొందో అనేది తెలియాల్సి వుంది.