రష్యా యువతిపై ఢిల్లీ ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

మంగళవారం, 27 జనవరి 2015 (09:08 IST)
ఢిల్లీలో కొందరు ఆటో డ్రైవర్లు, ఆవారాగాళ్ళు దేశ పరువు తీస్తున్నారు. ఒకవైపు భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. విదేశీ వనితలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వీరు దేశ ప్రతిష్టను బజార్లోకి ఈడ్చుతున్నారు. ఇందుకు తార్కాణంగా తాజా సంఘటన ఒకటి మళ్లీ వెలుగు చూసింది. గణతంత్ర వేడుకలను చూడడంతోపాటు, ఇండియా పర్యటనకు వచ్చిన ఓ రష్యా యువతిపై ఆటో డ్రైవర్ ఒకరు అత్యాచారయత్నం చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 
 
దేశ రాజధాని నగరంలో రెండు రోజుల కిందట వసంత్‌కుంజ్‌ నుంచి గ్రీన్‌ పార్కుకు ఆటోలో వెళ్తున్న యువతి(25)పై ఆటో డ్రైవర్‌ అసభ్య పదజాలంతో అత్యాచారానికి యత్నించాడు.  ఆమెను పెద్దగా జనసంచారంలేని ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. డ్రైవర్‌ చేష్టలపై అనుమానం కలిగిన  ఆమె ప్రతిఘటించగా డ్రైవర్‌ కొట్టి గాయపరిచాడు. ఆటోలో నుంచి దూకి పారిపోతుండగా ఆమెను వెంబడించాడు. 
 
అయితే ఆమె అతడిపై రాళ్లు రువ్వి  తప్పించుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి