భారీ వర్షానికే అయోధ్య గర్భగుడిలోకి నీరు... మందిరం పైకప్పు లీకేజీ!!

వరుణ్

మంగళవారం, 25 జూన్ 2024 (07:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో నిర్మించిన ప్రతిష్టాత్మక రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ వెల్లడించారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని, నీరు సరిగ్గా రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే చోటే నీరు కారుతుందని తెలిపారు. 
 
ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవని.. ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర.. ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి అంతస్తు పనులు జులై చివరకి, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని మిశ్ర విలేకరులకు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు