విద్యార్థుల ఘర్షణ... చేతులు వెనక్కి కట్టేసి మెడపై కత్తితో నరికేశారు..

మంగళవారం, 18 అక్టోబరు 2016 (09:07 IST)
చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయిమోహన్, శశిధర్ రెడ్డి అనే ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన స్వల్ప ఘర్షణ వారిలో ఒకరిపై కత్తితో దాడికి పాల్పడే వరకువెళ్లింది. దీంతో సాయిమోహన్ చేతులు వెనక్కి కట్టేసి మెడపై కత్తితో నరికిన శశిధర్ రెడ్డి.. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అతని అరుపులు కేకలు విన్న కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని రక్తపు మడుగులో పడి వున్న సాయిమోహన్‌ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి బంధువులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు అంటున్నారు.
 
పోలీసుల కాలేజీలో తోటి విద్యార్థుల వద్ద సేకరించిన వివరాల ప్రకారం ఇద్దరు విద్యార్థుల మధ్య ఉన్న ఆర్థిక వివాదాలే ఈ దాడికి కారణం అయ్యుంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయిమోహన్‌పై దాడికి పాల్పడిన శశిధర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి పరారవడంతో అతడిని అరెస్ట్ చేస్తే కానీ ఈ దాడి వెనుకున్న అసలు కారణాలు ఏంటో తెలిసే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి