బెంగాల్‌లో బీజేపీ ఎంపీ కీలక నేత అనుచరుడి కాల్చివేత!

సోమవారం, 5 అక్టోబరు 2020 (12:24 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ అర్జున్ సింగ్ ప్రధాన అనుచరుడుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గునమండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత అనుచరుడి కాల్చివేత ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 
 
బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగఢ్ మునిసిపల్ కౌన్సెలర్ మనీశ్ శుక్లాపై ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మనీశ్ శుక్లాను వెంటనే కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు.
 
మనీశ్ మృతి విషయం తెలిసిన బీజేపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు, మనీశ్ హత్యకు నిరసగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
 
కాగా, మనీశ్ కాల్చివేతపై ఎంపీ అర్జున్ సింగ్ స్పందించారు. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ పనేనని ఆరోపించారు. పోలీసుల సమక్షంలో కాల్పులు జరిగాయన్నారు. మనీశ్ తనకు సోదరుడి లాంటివాడన్నారు. అధికార టీఎంసీ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు