టీడీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి

ఆదివారం, 12 మార్చి 2017 (12:28 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు.  తెల్లవారు జామున తీవ్ర గుండెపోటుతో బాధపడ్డ ఆయనను హుటాహుటీన అనుచరులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యలు చికిత్స అందించినా ఆయన శరీరం స్పందించకపోవడంతో ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు. మూడుసార్లు ఎంపీగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతు దారులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో భూమా జన్మించారు. భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడి మృతి తర్వాత 1992 ఉప ఎన్నికల్లో భూమా మొదటిసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.
 
2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరారు. టీడీపీతోనే రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుని భూమా భావించారు. అయితే కూతురు అఖిల ప్రియ రాజకీయాల్లో స్థిరపడ్డాక విశ్రాంతి తీసుకుంటానని భూమా నాగిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. 
 
2014 ఏప్రిల్‌ 24న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. గత వారం రోజులుగా భూమా అనారోగ్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో శనివారం విజయవాడలో భూమానాగిరెడ్డి చంద్రబాబును కలిశారు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి