దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని తొలి ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 వ్యాజ్యాలపై సుధీర్ఘంగా విచారణ జరిపిన అపెక్స్ కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ నోట్ల రద్దు చట్ట ప్రకారమే జరిగిందని తెలిపారు. అయితే, రద్దయిన నోట్ల మార్పిడికి కల్పించిన విండో సహేతుకంగా లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి అనుకూలంగా తీర్పునిచ్చారు.
జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. డీమానిటైజేషన్ నిర్ణయంతో ఎలాంటి చట్టపరమైన రాజ్యాంగపరమైన లోపాలు లేవని ధర్మాసనం పేర్కొంది. అయితే, రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు మార్పిడి చేసుకునేందుకు కల్పించిన రూ.53 రోజుల విండో మాత్రం సహేతుకంగా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 1978 డిమానిటైజేషన్ సమయంలో రద్దు చేసిన నోట్ల మార్పిడికి తొలుత మూడు రోజుల అవకాశం కల్పించి ఆ తర్వాత దాన్ని ఐదు రోజులకు పెంచారని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
కాగా, నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, అందువల్ల దీన్ని కొట్టివేయాలని పిటిషన్లు కోరారు. ఇది జరిగి పోయిన నిర్ణయం కనుక ఈ విషయంలో స్పష్టమైన ఉపశమనం ఇవ్వలేనపుడు కోర్టు ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వం వాదించింది.