వామ్మో.. ఆ జైలులో టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల రాజభోగాలు అనుభవిస్తున్నారట.. బర్త్ డే కేకులు, కుక్‌లు, జిమ్‌లు?

మంగళవారం, 29 నవంబరు 2016 (14:42 IST)
పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతంలోని నాభా కారాగారంలో శిక్ష అనుభవించే ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు రాజభోగాలు అనుభవిస్తున్నారట. ఆదివారం పది మంది సాయుధులు నాభా కారాగారంపై దాడి చేసి ఆరుగురుకేఎల్‌ఎఫ్‌ ఉగ్రవాదులను విడిపించుకుని పారిపోయిన నేపథ్యంలో ఈ జైలు గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారాగారంలో శిక్ష అనుభవించే టెర్రరిస్టులు, నేరచరిత్ర కలిగిన గ్యాంగ్‌స్టర్లు ఖైదీలు తినే మెస్‌ల్లో భోజనం చేసే ప్రసక్తే లేదట. 
 
అంతేకాదండోయ్ తోటి ఖైదీల చేత (పర్సనల్ కుక్స్) వండించుకుని వేరుగా కూర్చుని తింటారట. మొన్న జైలు నుంచి తప్పించుకుని పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌.. నవంబర్‌ 22న తన స్నేహితుడు కుల్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి పుట్టినరోజు జరుపుకొని బర్త్‌డే కేక్‌తో సహా తన ఫొటోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడంటే.. జైలులో వారు ఎంతలా రాజభోగాలు అనుభవిస్తున్నారో తెలుసుకోవచ్చు. 
 
నాభా జైల్లో ఖైదీలు ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లో 150 ఫొటోలు పోస్ట్‌ చేశారు. జైలు బయట ఉన్న తమ అనుచరుల చేత హత్యలు చేయించి కొద్ది గంటలవ్యవధిలోనే తామే చేయించినట్లు ధైర్యంగా ఫేస్‌బుక్‌ ద్వారా చెప్పేస్తున్నారు. 
 
ఆదివారం జైలు నుంచి తప్పించుకునేందుకు సాయుధులైన తమ అనుచరులు వస్తున్నారని తెలిసి జీన్స్‌ ప్యాంట్లు, స్వెటర్లు, స్పోర్ట్స్‌ షూస్‌తో రెడీగా ఉన్నారని, మిలిటెంట్లైనా రూల్స్‌ పాటిస్తారేమో కానీ గ్యాంగ్‌స్టర్లకు ఎలాంటి రూల్స్‌ఉండవని, వారికి ఎదురుచెప్పే ధైర్యం కూడా చేయలేరని జైలు అధికారులు చెప్తున్నారు. ఈ జైలులో ఉన్న ఖైదీలకు బర్త్ డే కేకులు, కుక్‌లు, జిమ్‌లు అన్నీ వుంటాయని.. హైక్వాలిటీ నెయ్యితో తయారైన వంటకాలు.. లావైతే కెలోరీలు తగ్గించుకునే జిమ్‌లు ఈ జైలులో ఉన్నాయని.. దడ్కా, దాల్, వెజిటబుల్స్‌తో చేసిన వంటకాలను ఇష్టానికి లాగిస్తారని జైలు అధికారి ఒకరు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి