టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేసిన కర్నాటక

మంగళవారం, 30 జులై 2019 (15:47 IST)
కర్నాటక రాష్ట్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం నిర్వహిస్తూ వచ్చిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేసింది. నిజానికి టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను బీజేపీ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఆయన కాలంలో అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశారనీ, అనేక మంది హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో ఇటీవల ముఖ్యమంత్రి యడియూరప్ప సారథ్యంలో బీజేపీ సర్కారు కొలువైంది. ఈ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ వేడుకలను రద్దు చేసింది. పైగా, ఈ వేడుకలు వివాదాస్పదం, మతపరమైన వేడుకలు కాబట్టే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్నాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన కేవలం మూడు రోజుల్లోనే ఈ తరహా నిర్ణయం రావడం గమనార్హం. 
 
గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2015 నవంబరు పదో తేదీన ఈ వేడుకలను నిర్వహించింది. ఆ తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారులో హెచ్.డి. కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా ఈ వేడుకలను నిర్వహించారు. 
 
అయితే, విరాజ్‌పేట ఎమ్మెల్యే కేజీ బోపయ్య తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు రాసిన లేఖలో ఈ టిప్పు సుల్తాన్ వేడుకలు నిర్వహించడం వల్ల ముఖ్యంగా కొడగు జిల్లాలో మతహింస ప్రజ్వరిల్లుతుందని, అందువల్ల వీటిని రద్దు చేయాలని కోరారు. ఈ లేఖను పరిశీలించిన సీఎం ఈ వేడుకలను రద్దు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు