ముఖేష్ గౌడ్ ఇక లేరు.. వెంటిలేటర్‌పై ఓటేశారు.. తిరిగిరాని లోకాలకు..

సోమవారం, 29 జులై 2019 (16:06 IST)
కేన్సర్ వ్యాధి బారిన పడి కొంతకాలంకా అపోలోలో చికిత్స పొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ (60) కన్నుమూశారు. ఏడు నెలల పాటు కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించారు. 
 
కానీ చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేష్‌గౌడ్ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా ఆయనకు ప్రాధాన్యత దక్కింది. ఆయనకు భార్య.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 
 
1989లో తొలిసారి మహారాజ్‌గంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్.. 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గంలో విజయం సాధించారు. 2009లో మూడోసారి గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 
 
అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో గోషామహాల్ నుంచి పోటీచేసిన ఆయన.. ఆరోగ్యం సహకరించకపోవడంతో.. వెంటిలేటర్‌పై వచ్చి ఓటువేశారు. అదే ఆయన చివరి ఓటుగా మిగిలిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు