ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారట...

శుక్రవారం, 30 మార్చి 2018 (10:11 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు హారాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. వీరికితోడు ఇపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా జతకలిశారు. 
 
అయితే, కమలనాథుల ప్రచారపర్వంలో అపశ్రుతులు చోటుచేసుకోవడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. కర్ణాటక రాష్ట్రంలో దేవనగిరి జిల్లాలో బీజేపీ చేపట్టిన ప్రచార ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అమిత్ షా ప్రసంగాన్ని అనువదించిన ప్రహ్లాద్ జోషి 'ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు... దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు... దేశాన్ని ఆయన నాశనం చేయడం ఖాయం' అంటూ పేర్కొన్నారు. 
 
అమిత్ షా హిందీ భాషలో చేసిన ప్రసంగాన్ని కర్ణాటక బీజేపీ నేత తప్పుగా అనువదించడంతో ర్యాలీకి వచ్చిన ప్రజలు, నేతలు విస్తుపోయారు. వాస్తవంగా అమిత్ షా సిద్ధరామయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, యడ్యూరప్పకు ఓటేసి మోడీపై అభిమానాన్ని చాటుకోవాలని కోరగా అనువాదకుడు పొరపాటుగా చేసిన అనువాదంతో ర్యాలీలో కలకలం చెలరేగింది. గతంలోనూ 'అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాలకు పోటీపెడితే యడ్యూరప్ప సర్కారే నంబర్‌ వన్‌ అవార్డును సాధిస్తుంది' అని అమిత్ షా వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు