నితీశ్‌కు ఇక మూడింది ... బీహార్ రావణకాష్టంగా మారింది : లాలూ ప్రసాద్

గురువారం, 29 మార్చి 2018 (16:09 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మూడిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. దాణా స్కామ్‌లో ఆయనకు గరిష్టంగా 12 యేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా జైలు జీవితం గడుపుతున్న లాలూ అనారోగ్యంబారిన పడటంతో గురువారం చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు వచ్చారు. 
 
ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీహార్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లర్లు, హింస చోటుచేసుకుంటున్నట్లు లాలూ ఆరోపించారు. బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని కుంప‌టిగా మార్చేస్తోంద‌ని ఆరోపించారు. బీహార్‌లో అల్లర్లు చెలరేగడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పని ఇక ముగిసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 
 
ఈనెల 17వ తేదీన బీహార్‌లోని భాగల్పూర్‌లో మతఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శాశ్వత్ నాయకత్వంలో బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ఓ ఊరేగింపు సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. హింసను రెచ్చగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ... అరెస్టు చేయడంలో జాప్యం జరగడంపై ప్రతిపక్షాలు నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు