బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు .. 12 మంది మృత్యువాత

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:12 IST)
తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించటంతో 12 మంది సజీవదహనమయ్యారు. ఈ సంఘటన విరుద్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం జరిగింది. 
 
విరుద్‌నగర్‌ జిల్లా అచన్‌కులమ్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్న నాలుగు షెడ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 
 
ఈ మంటలు అదుపుచేయటానికి దాదాపు 30 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. రాష్ట్ర గవర్నర్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిలు సంతాపాన్ని వెలుబుచ్చారు. అలాగే, మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.3 లక్షలు, ప్రధాని మోడీ రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు