వీకే శశికళ ఇళ్లపై దాడులు.. 1050 ఎకరాల భూమి స్వాధీనం

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:04 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లపై దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి కేసులో నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ తర్వాత చెన్నైకి చేరుకున్న మూడు రోజులకే ఆమె సంబంధీకులపై దాడులు మొదలయ్యాయి.
 
కాంచీపురం, తంజావూర్‌, తిరువారూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లోని పలు ఆస్తులను అధికారులు జప్తు చేశారు. కాంచీపురంలో రూ.300 కోట్ల విలువైన 144 ఎకరాలకు పైగా భూమి, తంజావూర్‌లో 26 వేల చదరపు అడుగుల భూమి, తిరువారూర్‌లో సుమారు 1050 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములన్నీ శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని, ఇవన్నీ 1994-96 మధ్య కొనుగోలు చేసినవేనని పోలీసులు తెలిపారు.
 
అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకే తాము దాడులు చేశామని అధికారిక ప్రకటనల్లో ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగడానికి మూడు నెలల ముంగిట జైలు నుంచి శశికళ విడుదలైన నేపథ్యంలో ఈ దాడులు జరుగడం కొన్ని సందేహాలు, అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందులో రాజకీయ కక్ష సాధింపేమీ లేదని, కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందిస్తుందని రాష్ట్ర సీఎం ఈకే పళనిస్వామి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు