అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను పూర్తి చేసుకున్న శశికళ ఇటీవలే విడుదలయ్యారు. ఆ తర్వాత ఆమె చెన్నైకు చేరుకున్నారు. దీనికితోడు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పైగా, జయలలిత వారసురాలిని తానేనని శశికళ ప్రకటించింది.
అంతేకాదు, తన వాహనంపై ఆమె అన్నాడీఎంకే జెండాను ఉంచారు. ఈ నేపథ్యంలో శశికళను నిలువరించేందుకు అన్నాడీఎంకే నేతలు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేరుగా రంగంలోకి దిగారు. శశికళ, దినకరన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వారు ఎన్ని గిమ్మిక్కులకు పాల్పడినా, తలకిందుల తపస్సు చేసినా పార్టీలో చేర్చుకోబోమని అన్నారు. జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్పారు. శశికళ, దినకరన్ వర్గం ఆటలు సాగబోవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.