దివ్యాంగులు, వయో వృద్ధుల ఇళ్లకు వెళ్లి, వ్యాక్సినేషన్ చేసేందుకు అవకాశం ఉందా? అని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని అడిగింది. కేంద్రం అనుమతి ఇస్తే ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్లు వేసేందుకు సిద్ధమని తెలిపారు.
దీనిపై కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇటువంటివారి ఇళ్లకు వెళ్లి, టీకాలు ఇచ్చేందుకు బీఎంసీ అంగీకరిస్తే, అందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించకపోయినా, తాము అనుమతిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణి డివిజన్ బెంచ్ తెలిపింది.
'ఇంటింటికీ వెళ్ళి వ్యాక్సినేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపకపోయినప్పటికీ, మేం మీకు (బీఎంసీకి) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం' అని తెలిపింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే స్థితిలో లేనివారికి, వారి ఇంటి వద్దకే వెళ్ళి వ్యాక్సినేషన్ చేయగలరా? అని అడిగింది.
మంచానికే పరిమితమైనవారు, వీల్‌ఛైర్‌లోనే గడిపేవారు, వయో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ళ వద్ద తగిన వైద్యపరమైన రక్షణ చర్యలతో టీకాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? లేదా? అనే విషయంపై అఫిడవిట్‌ను గురువారం దాఖలు చేయాలని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్‌ను ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజూ చాలా విలువైనదని, తదుపరి విచారణ రేపే (గురువారమే) జరుపుతామని తెలిపింది.