హోసూరుకు సమీపంలోని కుంబళం గ్రామానికి చెందిన రైతు మంజు (25) అనే యువకుడికి ఆంధ్రప్రదేశ్‌లోని మంచునాయకనపల్లి గ్రామానికి చెందిన సుధ(19)తో వివాహం నిశ్చయమైంది. మంజు ఆదివారం ఉదయం పెళ్ళిపత్రికలను తన స్నేహితులకు, బంధువులకు అందజేసేందుకు తమ ఊరినుంచి శూలగిరివైపు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు.
ఆ సమయంలో ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఇతని వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మంజు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతన్ని ఢీకొన్న కారు ఆగకుండా వెళ్ళిపోయింది. సమాచారం తెలిసిన శూలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాదీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.