కరోనా వైరస్ దెబ్బకు ముఖ్యమైన పండుగలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ క్రీడా సంగ్రామాలు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో దేశంలో పండగల సీజన్ మొదలైంది. ఇందులోభాగంగా, ఈ నెల 22వ తేదీన గణేష్ చతుర్థి జరుగనుంది. ఈ పండుగను పురస్కరించుకుని గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే, ఈ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
దీన్ని విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎస్ఏ బాబ్డే... ఈ యేడాది మహారాష్ట్రలో గణేశ్ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టంచేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ వేళ జనం భారీగా గుమికూడే అవకాశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో అటువంటి అనుమతి ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు.
అయితే మహారాష్ట్రలోని దాదర్, చెంబూర్, బైకులా జైన ఆలయాలను తెరిచేందుకు మాత్రం కోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి నిబంధనల మధ్య ఆలయాలను తెరవాల్సి ఉంటుంది. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవచ్చు అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.