కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆయన తనయుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం చిదంబరంను కూడా సీబీఐ పిలిచే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొరకరాని కొయ్యిలా మారిన చిదంబరంపై ఓ కన్నేశారు. దీంతో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా కేసును వెలికి తీశారు. ఈ కేసులో ప్రధాని మోడీ దూకుడు దెబ్బకు చిదంబరం బెంబేలెత్తిపోయారు. తనను, తన కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని, వాటిని నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది ఇంకా విచారణకే రాలేదు.
ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన కార్తీని బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఢిల్లీకి తీసుకెళ్ళి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేశారు.