'మహిళల శరీరసౌష్టవ అత్యుత్తమ కొలతలు' 36–24–36... సీబీఎస్‌ఈ సిలబస్‌లో...

గురువారం, 13 ఏప్రియల్ 2017 (11:38 IST)
సీబీఎస్‌ఈ 12వ తరగతి పాఠ్యాంశంలో ప్రత్యక్షమవడంతో వివాదం చెలరేగింది. మహిళల అత్యుత్తమ శారీరక కొలతలుగా 36-24-36 అని 12వ తరగతికి చెందిన ఓ పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. ఇవి పెను వివాదానికి తెరతీశాయి. ఆ వర్ణనను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సామాజికమాధ్యమాల్లో పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
వి.కె.శర్మ అనే నిపుణుడు రాసిన ఆరోగ్యం, శారీరక విద్య పుస్తకాన్ని ఢిల్లీకి చెందిన న్యూ సరస్వతి హౌజ్‌ ప్రచురించింది. పలు సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని బోధిస్తున్నారు. 36-24-36 రూపాన్ని మహిళలకు అత్యుత్తమంగా పరిగణిస్తారు. అందుకే ప్రపంచ సుందరి, విశ్వ సుందరి పోటీల్లో ఈ ఆకృతిని పరిగణనలోకి తీసుకుంటారు అని పుస్తకంలోని ఓ పాఠంలో పేర్కొన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలను ఫొటో తీసి పలువురు ట్విటర్‌లో పెట్టారు. 
 
గతంలో నాలుగో తరగతి పర్యావరణశాస్త్ర పుస్తకంలో ఉన్న సారాంశంపై కూడా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రచురణకర్తలు గతనెల్లో దాన్ని ఉపసంహరించుకున్నారు. బాలికలు అందవిహీనంగా ఉండటం, శారీరక వైకల్యాన్ని కలిగి ఉండటమే దేశంలో వరకట్నం కొనసాగుతుండానికి కారణమంటూ 12వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో ఉన్న వ్యాఖ్యలు కూడా ఇటీవల వివాదాస్పదమయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి