తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. అలాంటి గురువులు తమ పాఠశాలను వీడి మరో స్కూలుకు వెళుతుంటే విద్యార్థులు బోరున విలపిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఓ బడిపంతులు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెళ్లొద్దు సార్ అంటూ బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని చందౌలి జిల్లా రాయ్‌ఘడ్ అనే మారుమాల కొండ ప్రాంతంలో ఉన్న పాఠశాలకు నాలుగేళ్ల క్రితం శివేంద్ర సింగ్ అనే ఉపాధ్యాయుడు విధుల్లో చేరాడు. చిన్నారులకు మంచి చెడులు చెపుతూ వారి మనస్సులను గెలుచుకున్నాడు. విద్యా బోధన కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించేవాడు. దీంతో శివేంద్రను చిన్నారులు అమితంగా ప్రేమిస్తూ వచ్చారు. పైగా, గత నాలుగేళ్లలో చిన్నారుల హాజరుశాతం కూడా గణనీయంగా పెరిగింది.
ఈ క్రమంలో శివేంద్ర సింగ్‌ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థులు బోరున విలపించారు. సరిగ్గా గురు పౌర్ణమి రోజున ఆయనకు వీడ్కోలు పలికారు. ఆ పార్టీలో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ విద్యార్థులను సముదాయించి, వారి నుంచి సెలవు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.