ఈనెల 23వ తేదీన దేశం కొత్త ప్రధానమంత్ర్రిని చూడబోతుందని, ఆయన ఎవరో తానే వెల్లడిస్తానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద, గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ను అన్ని విధాలుగా నీరుగార్చి, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీని ఈనెల 23వ తేదీన ప్రజలు ఇంటికి సాగనంపనున్నారన్నారు.
ఆ తర్వాత దేశం కొత్త ప్రధానిని చూడబోతుందని చెప్పారు. 23న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి తీవ్ర పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం కోల్‌కతాకు వెళ్లారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 'భారత ప్రజాస్వామ్యం గొప్పతనం అదే. ప్రధాని ఎవరు అన్నది మీరు, నేను డిసైడ్ చేయలేం. మెజారిటీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చేశారు. ఈనెల 23న ఫలితాల అనంతరం దేశానికి ఎవరు ప్రధాని అయితే మంచిదన్న విషయమై ఏకాభిప్రాయానికి వస్తాం. ఈ నెల 21న సమీక్షా సమావేశం జరుగుతుంది. మే 23 తర్వాత సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాం' అని చంద్రబాబు వెల్లడించారు.