ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ 'జీఎస్ఎల్వీ.. ఎంకే-3'ని చంద్రునిపైకి ప్రయోగిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని మొత్తం కాల వ్యవధి యేడాదిపాటుగా శాస్త్రవేత్తలు తెలిపారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి దాదాపు రెండు నెలల అనంతరం ఈ రాకెట్ లాంచర్ చంద్రుని సౌత్ పోల్ సమీపంలో దిగుతుందని వారు వివరించారు. 640 టన్నుల రాకెట్ లాంచర్ అయిన దీన్ని 'బాహుబలి'గా అభివర్ణిస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. స్పేస్‌పోర్ట్ నుంచి లైవ్ లాంచ్‌ని చూసే మూడో రాష్ట్రపతి కానున్నారు ఆయన.. దాదాపు రూ.వెయ్య కోట్లతో చేపడుతున్న చంద్రయాన్-2 మిషన్‌లో 1.4 టన్నుల విక్రమ్ లాండర్ కూడా ఓ భాగం. ఇది 27 కిలోల బరువైన 'ప్రగ్యాన్' రోవర్‌ని మోసుకుపోతుంది.
కాగా, సుమారు 124 మిలియన్ డాలర్ల ఖర్చుతో చంద్రుడి ఆవలి వైపుకు ఇస్రో సాగిస్తున్న మహాయాత్ర చంద్రయాన్-2. సోమవారం వేకువజామున 2.51 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం1 రాకెట్ చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భారీ ప్రాజక్టుపై అమెరికా మీడియా వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శిస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా ఓవైపు అంగారకుడి వైపు పరుగులు పెడుతుంటే, ఇప్పుడందరూ చంద్రుడిపైకి మళ్లీ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అంగారకుడి వద్దకు వెళుతున్న అమెరికాకు చంద్రుడు మార్గమధ్యంలోని ఓ మజిలీ మాత్రమేనని, కానీ భారత్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రుడిపైకి యాత్ర చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ విమర్శనాత్మక ధోరణిలో పేర్కొంది.