ప్రపంచం అంతా భారత్ వైపు... జాబిల్లి పైకి చంద్రయాన్ 2... ఆదివారం అర్థరాత్రి అద్భుతం...
శనివారం, 13 జులై 2019 (14:19 IST)
ఫోటో కర్టెసీ-ఇస్రో
చందమామ రావే.. జాబిల్లి రావే... అనే గేయం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఇప్పటి సాఫ్ట్ జనరేషన్‌లో మెట్రోనగరాల్లో జన్మిస్తున్న వాళ్లు మినహా.. చిన్నప్పుడు ప్రతిఒక్కరూ ఈ పంక్తులను ఆస్వాదించిన వాళ్లే. చందమామను చూపిస్తూ.. ఈ పాటను పాడి చిన్నారులను నిద్రపుచ్చడం పెద్దలకు అనుభవమే.
అయితే.. చందమామ రావడం లేదు కానీ.. చంద్రుని మీదకే మనం వెళ్తున్నాం. మన రాయబారిని పంపిస్తున్నాం. చంద్రుని గుట్టుమట్లు తెలుసుకునేందుకు, చందమామ మీద ఏముందో తెలుసుకునేందుకు మన శాస్త్రవేత్తలు అరుదైన ప్రయోగం చేస్తున్నారు.
చందమామ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. మనుషుల ప్రతినిధిగా ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. వాస్తవానికి పదకొండు సంవత్సరాల క్రితమే 2008లోనే చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. చంద్రయాన్ - 2 రెక్కలు సరిచేసుకుంటోంది. చంద్రునిపైకి దూసుకెళ్లేందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ - షార్‌లో సర్వసంసిద్ధంగా ఉంది.
ఆదివారం అర్థరాత్రి అద్భుతం
ఈ మహత్కార్యంలో ఎక్కడా ఎలాంటి చిన్న లోపం కూడా తలెత్తకుండా.. ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యంత అరుదైన ఈ ప్రయోగం కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ప్రపంచదేశాలు కూడా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించాయి. షార్ నుంచి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. సోమవారం తెల్లవారు జామున 2 గంటల 51 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జీఎస్‌ఎల్‌వి మార్క్ 3-ఎం-1 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 2 ను అంతరిక్షంలోకి పంపించనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ - ఎఫ్‌డిఆర్, లాంచింగ్ రిహార్సల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ తర్వాత.. లాంచ్ రిహార్సల్స్‌లో భాగంగా చంద్రయాన్ - 2 లోని సిస్టమ్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయో.. డమ్మీకమాండ్స్ ద్వారా పరిశీలించారు. సిగ్నల్స్, కమ్యూనికేషన్ లింక్స్‌ను సరిచూశారు. రిహార్సల్స్ పూర్తయిన తర్వాత.. జీఎస్‌ఎల్‌వి మార్క్ 3-ఎం-1 లాంచ్ వెహికిల్ సిస్టమ్స్, ఆర్బిటర్, విక్రమ్ హెల్త్ చెకింగ్ సహా... పలు టెక్నికల్, సైంటిఫిక్ టెస్ట్‌లు నిర్వహించారు.
ఫోటో కర్టెసీ-ఇస్రో
సెప్టెంబరు 6న చంద్రుడి పైన ల్యాండ్...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. చంద్రయాన్-2 ద్వారా ఆర్బిటర్, లాండర్, రోవర్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ ప్రాజెక్టులో ఇవి మూడే కీలక ఘట్టాలు. లాండర్, రోవర్‌తో కూడిన 2379 కేజీల బరువుగల ఆర్బిటర్ నిర్ణీత అంతరిక్ష కక్ష్యలోకి చేరుకోనుంది. ఏడాది కాలం పాటు పనిచేసేలా ఆర్బిటర్‌ను ఇస్రో శాస్ర్తవేత్తలు రూపకల్పన చేశారు.
ఇక.. చంద్రయాన్-2లో రెండో ఘట్టం లాండర్. ఉపగ్రహ ప్రయోగంలో ఆర్బిటర్ అంతర్భాగంలోని ఓ కీలక పరిణామం. చివరి ఘట్టంలో మరో కీలక అంశం రోవర్. 6చక్రాల రోవర్ పరికరం బరువు 27కేజీలు కాగా లాండర్‌తో మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటూ 500మీటర్లు అంటే అర కిలోమీటరు మేర చంద్రుని చుట్టూ రోవర్ రోబోటిక్ వాహనం తిరగాడనుంది. ఇందుకు అవసరమైన సౌరశక్తిని గ్రహించేలా ఇస్రో రూపకల్పన చేసింది. సెప్టెంబర్ 6వ తేదీనాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ ల్యాండ్ అవుతుంది.
ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం యొక్క పితామహుడు డాక్టర్ విక్రమ్ ఎ సారాభాయ్ పేరు మీద లాండర్ ఆఫ్ చంద్రయాన్ 2 కు విక్రమ్ అని పేరు కూడా పెట్టారు. భూభాగంలోని 14 రోజులకు చంద్రుని సమీపంలో 1రోజుతో సమానమని చంద్ర మండలంలో ఒక్కరోజు పాటు పనిచేసేలా మన శాస్ర్తవేత్తలు లాండర్‌కు సాంకేతిక రూపం తీసుకొచ్చారు. చంద్రుని ఉపరితలంపైకి ఆర్బిటర్ నుండి 1471 కేజీల లాండర్‌ను మృదువుగా లాండింగ్ చేసేలా ఇస్రో బెంగళూరు కేంద్రం నుండి పర్యవేక్షించనుంది.
భారతదేశంలోని అత్యంత అధునాతన ఇంజనీరింగ్
పదకొండేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్-1కు అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఈ చంద్రయాన్-2. భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్-2 ఉపగ్రహంలో 13 పే లోడ్‌లు ఉంటాయి. వాటిలో ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 పేలోడ్లు అమర్చారు. వీటిలో ప్రధానంగా ఆరు పేలోడ్లు ఎంతో కీలకమైనవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిద్వారా చంద్రమండలాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చని, పరిశోధనల్లో వాస్తవ అంశాలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
భారతదేశంలోని అత్యంత అధునాతన ఇంజనీరింగ్ అద్భుతాల ద్వారా చంద్రయాన్ 2 తన లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ఇస్రో చెమటోడుస్తోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన సాంకేతికత, సాఫ్ట్‌వేర్లను కలిగి ఉన్న ఇస్రో.. ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్లో ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన ప్రయోగంగా చంద్రయాన్ 2 ప్రాజెక్టును అంచనా వేస్తున్నారు. అయితే.. అతి తక్కువ ఖర్చుతో భారత్ ఈ ప్రాజెక్టుని పూర్తి చేసింది. చంద్రయాన్ -2 మిషన్ మొత్తం ఖర్చు 978 కోట్ల రూపాయలు మాత్రమే.