'విక్రమ్' శకలాలు గుర్తించిన షణ్ముగ సుబ్రమణియన్? ఎవరు.. ఏం చేస్తుంటాడు?
మంగళవారం, 3 డిశెంబరు 2019 (09:58 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహకారంతో విక్రమ్ ల్యాండర్ శకలాలను ఓ భారతీయ సైంటిస్ట్ గుర్తించారు. అతని పేరు షణ్ముగ సుబ్రమణియన్. అసలు ఎవరీ షణ్ముగ సుబ్రమణియన్ అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, షణ్ముగ సుబ్రమణియన్.. వృత్తిరీత్యా ఓ మెకానికల్ ఇంజనీర్. బ్లాగర్. యాప్ డెవలపర్. క్యూఏ ఇంజనీర్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2లో విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించగా, అది దక్షిణ ధృవంపై కూలిపోయింది. ఈ విక్రమ్ ల్యాండర్ ఆచూకీని షణ్మగ గుర్తించారు. సొంతూరు చెన్నై.
ఈ చెన్నపట్టణం చిన్నోడే విక్రమ్ జాడను తొలిసారి గుర్తించినట్లు నాసా కూడా అధికారికంగా ప్రకటించింది. లూనార్ ఆర్బిటార్ తొలిసారి తీసిన ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని.. వాటిని పరిశీలిస్తున్న సమయంలో ఇంజినీర్ షణ్ముగకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఫోటోల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను గుర్తించి.. బహుశా అవే విక్రమ్ కూలిన ప్రాంతాలేమో అని నాసాకు ట్వీట్ చేశారు.
నిజానికి చంద్రుడి గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహాంతో షణ్ముగ పదేపదే ఎల్ఆర్వో రిలీజ్ చేసిన ఫోటోలను పరిశీలించాడు. ఒకవేళ విక్రమ్ సక్రమంగా ల్యాండ్ అయి.. అది ఫోటోలను పంపినా, చంద్రుడిపై ప్రతి ఒక్కరికీ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో అని షణ్మగ తన మెయిల్ ద్వారా నాసాకు తన అభిప్రాయాన్ని వినిపించాడు. తొలుత ఎల్ఆర్వీ ఇమేజ్‌లను అప్పుడప్పుడు స్కాన్ చేస్తూ ఉన్న షణ్ముగకు కొన్ని తేడాలు కనిపించాయి.
వైగా, విక్రమ్ ల్యాండర్ ఏ దిక్కున కూలిపోయింది. అది కూలే సమయంలో ఉన్న దాని వేగం, ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని షణ్ముగ విక్రమ్ ఆచూకీ కోసం ప్రయత్నించాడు. దాంతోనే విక్రమ్ కూలిన ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించగలిగాడు. వాస్తవానికి విక్రమ్ దిగాల్సిన ప్రాంతానికి సుమారు మూడోవంతు మైలు దూరంలో ఓ చిన్నపాటి వైట్ స్పార్క్‌ను గుర్తించాడు. అంతకముందు పరిశీలించిన ఇమేజ్‌లో ఆ స్పాట్ లేనట్లు షణ్ముగ పసికట్టాడు. ఆ తేడాతో యువ ఇంజినీర్ ఓ ఐడియాకు వచ్చేశాడు. బహుశా విక్రమ్ కూలడం వల్ల ఆ ప్రాంతంలోనే ల్యాండర్ కనుమరుగై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.
రెండు దృశ్యాల్లో ఉన్న తేడాలను గుర్తించిన షణ్ముగ వాటిని నాసాకు పంపించాడు. తన ట్విట్టర్ అకౌంట్‌లోనూ నాసా ఫోటోలను పోస్టు చేశాడు. లూనార్ ఆర్బిటార్ వాటిని స్టడీ చేసింది. చంద్రుడిపై విక్రమ్ కూలకముందు, కూలిన తర్వాత నవంబర్ 11వ తేదీన తీసిన ఫోటోలను నాసా అధ్యయనం చేసింది. అయితే ఎక్కడైతే విక్రమ్ దిగాలో.. దానికి ఆగ్నేయ దిశలో సుమారు 2500 అడుగుల దూరంలో విక్రమ్ ఉన్నట్లు నాసా ధృవీకరించింది.
కొన్ని గంటల క్రితమే నాసా శాస్త్రవేత్తలు షణ్ముగకు మెయిల్ చేశారు. ఆ లేఖలో విక్రమ్‌ను గుర్తించిన షణ్ముగకు శుభాకాంక్షలు చెప్పింది. సుబ్రమణ్యస్వామి జన్మతిథి షష్ఠి. షణ్ముగ షష్ఠి రోజునే నాసా ఈ శుభ సందేశం వినిపించడం సంతోషకరమే. నాసా తనకు క్రెడిట్ ఇచ్చిన విషయాన్ని షణ్ముగ తన ట్వీట్‌లో తెలిపాడు. సో.. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఓ భారతీయుడే కనిపెట్టాడు.