2021 మొదట్లోనే చంద్రయాన్‌-3 ప్రయోగం.. జితేంద్ర సింగ్

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (13:31 IST)
Jitendra Singh
చంద్రయాన్‌-2ను 2019 జూలై 22న ప్రయోగించారు. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది. కానీ ఆర్బిటార్ మాత్రం డేటాను పంపిస్తూనే వుంది. మరోవైపు 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌-1 పంపిన ఫోటోలు తాజాగా ఓ కొత్త విషయాన్ని తేల్చాయి. చంద్రుడి ద్రువాలు తుప్పుపట్టిపోతున్నట్లు ఆ ఫోటోలు వెల్లడించాయి. నాసా శాస్త్రవేత్తలు కూడా దీన్ని ద్రువీకరించారు.
 
కాగా.. చంద్రయాన్‌-2ను 2019లో ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. వాస్తవానికి చంద్రయాన్‌-3ని 2020లో లాంచ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల ఆ ప్లాన్‌ కాస్త జాప్యం అయ్యింది. లాక్‌డౌన్ వల్ల చంద్రయాన్‌-3 ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడిపైకి చంద్రయాన్-3 మిషన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష శాఖకు చెందిన సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్-2తో పోలిస్తే చంద్రయాన్‌-3 భిన్నంగా ఉంటుందన్నారు. చంద్రయాన్‌-3లో ఆర్బిటర్ ఉండదన్నారు. కానీ ఆ ప్రాజెక్టులో ల్యాండర్‌, రోవర్ ఉన్నాయన్నారు. 2021 మొదట్లోనే చంద్రయాన్‌-3ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు