తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గంలోకి మరో కొత్త మంత్రి చేరారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈయన రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి... ఉదయనిధి స్టాలిన్‌తో ప్రమాణం చేయిస్తారు.
ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న సీఎం స్టాలిన్ పంపిన ప్రతిపాదనను గవర్నర్ ఆర్ఎన్. రవి ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కాగా, గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ట్రిప్లికేణి - చెప్పాక్కం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వారసత్వ రాజకీయాలు తగవు అంటూ దేశ వ్యాప్త చర్చ జరుగుతున్న సమయంలో ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోనుండటం గమనార్హం.