ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే మంగళవారం రాత్రి దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. జేఎన్‌యూకి వెళ్లిన దీపిక దాదాపు 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపారు. కానీ ఏమాత్రం నోరు విప్పకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీపిక వర్సిటీని సందర్శించిన సమయంలో జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
మంగళవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె యూనివర్సిటీకి వచ్చారు. జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను ఆమె పరామర్శించారు. ఆ తర్వాత మరి కొంతమంది విద్యార్థులను కలిసి మాట్లాడారు. దీపికా పదుకొనె జేఎన్‌యూను సందర్శించిన నేపథ్యంలో బీజేపీ నేత తేజేందర్ సింగ్ బగ్గా ఆమెపై తీవ్రంగా స్పందించారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అఫ్జల్ గ్యాంగ్‌కు మద్దతు పలుకుతున్న దీపికా పదుకొనె సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెపై మండిపడుతున్నారు.