అన్నం వద్దు కప్పు టీనే ముద్దంటున్న మహిళ...

సోమవారం, 25 మార్చి 2019 (19:47 IST)
సాధారణంగా చలికాలంలో ఓ కప్పు వేడి చాయ్ తాగితే వచ్చే కిక్కే వేరు. అందులోనూ గరమ్ చాయ్ తాగితే మరింత కిక్కు. అందుకే ఓ మహిళ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు బదులు ఒక్క చాయ్‌ తాగుతూ బతికేస్తోంది. అయితే, టీ తాగి ప్రాణాను నిలుపుకోవడం సాధ్యమేనా అనే సందేహం ఉత్పన్నమవుతోంది. కానీ మన దేశంలోనే ఒక మహిళ 33 ఏళ్ల నుంచి చాయ్ మాత్రమే తాగి జీవిస్తోంది.
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లీ దేవిని అంతా చాయ్ వాలీ చాచీ అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె 33 ఏళ్లకు పైగా సమయం నుంచి టీ తాగి జీవిస్తోంది. 11 ఏళ్ల వయసులో ఆహారం ముట్టడం మానేసిన పిల్లీ దేవి వయసు ఇప్పుడు 44 ఏళ్లు. అంటే ఆమె 33 ఏళ్లుగా కేవలం టీ నీళ్లు తాగే బతుకుతోంది. అలాగనీ ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. 
 
పిల్లీ దేవి అలవాటుతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఇదేమైనా వ్యాధేమోనని ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమె ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పారు. పిల్లీ దేవి ఎప్పుడో తప్ప ఇంటి నుంచి అడుగు బయటపెట్టదు. రోజంతా శివారాధనలోనే గడుపుతుంది. మనుషులు టీ తాగి బతకడం అసాధ్యమని కొరియా జిల్లా ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. పైగా, 33 ఏళ్లుగా ఆమె అలా జీవించడం ఆశ్చర్యపరుస్తోందని అభిప్రాయపడుతున్నారు. 
 
దీనిపై పిల్లీదేవి తండ్రి రతీరామ్ మాట్లాడుతూ, తన కుమార్తె ఆరో తరగతి చదివేటపుడు తిండి మానేసిందన్నారు. కొన్నాళ్లు పాల టీతో బిస్కెట్లు, బ్రెడ్ తిని ఆ తర్వాత పూర్తిగా టీ మీదే బతుకుతోంది. ఇప్పుడామె సూర్యాస్తమయం తర్వాత ఒకసారి కప్పు బ్లాక్ టీ మాత్రం తాగుతుందని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు