చైనా నిధులతో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ : మంత్రి రవిశంకర్ ప్రసాద్

గురువారం, 25 జూన్ 2020 (19:09 IST)
గాల్వాన్ లోయలో చైనా సైనికుల బరితెగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముఖ్యంగా, కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌తో పాటు అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడికి దిగారు. 
 
చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ ట్రస్టుకు చైనా దౌత్య కార్యాలయం నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చైనాకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. 
 
అంతకుముందు, గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. దురాక్రమణలకు పాల్పడకపోతే ఇంతమంది భారత సైనికులు ఎలా చనిపోయారు? వారు చనిపోయింది ఎవరి భూభాగంలో? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. 
 
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలంటూ హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు