రోగులకు వైద్యులు సాంత్వన చేకూర్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కోరారు. పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ (పీజీఐఎస్ఈఆర్) స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావించారు. రోగులను అర్థం చేసుకునే సున్నిత హృదయం యువ డాక్టర్లకు ఉండాలని ఆయన సూచించారు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' సినిమాలోని సన్నివేశాలు ఇదే అంశాన్ని ప్రతిఫలిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
దేశంలో వైద్య విద్య అభివృద్ధికి పీజీఐఎస్ఈఆర్ గత 62 ఏళ్లల్లో ఎంతో చేసిందని కొనియాడారు. దేశంలో వైద్య రంగం అభ్యున్నతికి పాటుపడాల్సిన బాధ్యత యువ డాక్టర్ల మీద ఉందని అన్నారు. రోగుల సాధకబాధకాలను అర్థం చేసుకుని, సాంత్వన కలిగించాల్సిన బాధ్యత యువ డాక్టర్లపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్నాభాయ్ సినిమాలోని హీరో ఆత్మీయ ఆలింగనం ఎందరో రోగులకు భరోసా, మనస్సాంతిని కలిగించిన విషయాన్ని గుర్తు చేశారు. పేషెంట్ల బాధలు, మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన ఆవస్యకతను ఈ సీన్ ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల నీట్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించిన ఆయన మెడికల్ కాలేజీల్లో ఎంట్రీకి సంబంధించి నైతికత కూడా కీలకమని అన్నారు.