భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే అన్నారు. కానీ, అంతకంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం వంటి అంశాల్లో వెనుకబడిన వారికి మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశ పౌరుడినైనందుకు చాలా గర్విస్తున్నానని తెలిపారు. కానీ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా చాలా కృషి జరగాలన్నారు. జేడీయూ, ఆర్‌ఎల్‌డీ వంటి పార్టీలు వైదొలగటంతో విపక్ష 'ఇండియా కూటమి' ఆదరణ కోల్పోయిందని సేన్ విశ్లేషించారు.
భారత్ అభివృద్ధికి నిరక్షరాస్యత, లింగ అసమానత్వం అడ్డంకులుగా మారాయని తెలిపారు. భారత పాలకవర్గం పూర్తిగా ధనవంతుల పక్షానే నిలుస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలో మార్పులపై ప్రస్తావించగా.. దాని వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు.