నాలుగు దశాబ్దాల తర్వాత అలహాబాద్ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్!!

వరుణ్

మంగళవారం, 11 జూన్ 2024 (09:58 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి సీట్ల సంఖ్య బాగా  పెరిగింది. ఈ రాష్ట్రంలోని అలహాబాద్ లోక్‌సభ స్థానాన్ని 40యేళ్ల తర్వాత మళ్లీ ఇంతకాలానికి దక్కించుకునంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నీరజ్ త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిపై రమణ్ సింగ్ 58 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 
 
ఉజ్వల్ రమణ్ సింగ్ సమాజ్వాది పార్టీ సీనియర్ నేత రేవతి రమణ్ సింగ్ తనయుడు. ఉజ్వల్ గతంలో ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో పని చేశారు. అయితే కొన్నిరోజుల క్రితం ఎస్పీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అలహాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు.
 
అలహాబాద్ నుంచి కాంగ్రెస్ చివరిసారి 1984లో గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోటీ చేసి గెలిచారు. కానీ మూడేళ్లకే ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికల్లో జన్ మోర్చా తరపున వీపీ సింగ్ విజయం సాధించారు. నాటి నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి అలహాబాద్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఆ తర్వాత వరుసగా ఒకసారి జనతా దళ్, మూడుసార్లు బీజేపీ, రెండుసార్లు ఎస్పీ, రెండుసార్లు బీజేపీ విజయం సాధించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు