ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఒకవైపు, కరోనా మరోవైపు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనాతో జనం గజగజలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండూ ఒకేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్‌గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపింది. మరో విషయం ఏంటంటే రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది.
ఇవి తీవ్రమైతే మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపింది. రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. పైగా రెండింటికీ వేర్వేరు చికిత్స చేయాలి. ఎందుకంటే డెంగీలో ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు.
కరోనా రోగుల్లో వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే హెపారిన్ మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.