25 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ!..

బుధవారం, 9 డిశెంబరు 2020 (07:16 IST)
భారత్ లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది. యూకేలో మంగళవారం మొదలైన టీకా పంపిణీ .. భారత్ లోనూ డిసెంబరు 25న మొదలు కాబోతోంది. ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.

తొలిదశ టీకా కార్యక్రమంలో భాగంగా.. కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి జనవరి 15 నాటికల్లా వ్యాక్సిన్‌ అందించేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.

కొవిడ్‌ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాల అధికారులకు ఈ భేటీలో సూచించింది. టీకాలు ఎలా అందించాలనే విషయాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. 
 
వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే.

సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) పరిధిలోని ‘కొవిడ్‌-19 విషయ నిపుణుల కమిటీ’ ఈ మూడు విజ్ఞప్తులను బుధవారం పరిశీలించనుంది. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నామని.. వీలైనంత త్వరలోనే ఆ మూడిటిపై లేదా వాటిలో ఏదో ఒకదానిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తొలి దశ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గుర్తించిన వైద్య సిబ్బంది వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. తొలి దశలో మూడు కోట్ల డోసుల టీకాను నిల్వచేసేందుకు ప్రస్తుతం ఉన్న శీతల గిడ్డంగులు సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు.
 
కోవిన్‌ సాప్ట్‌వేర్‌లో పేరుంటేనే..
తొలివిడత టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాల్లోని గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో.. ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందులో పేరున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. వైద్యులు, వైద్యసిబ్బంది కోవిన్‌ సాప్ట్‌వేర్‌లో స్వీయ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కూడా కల్పించారు.

అందుకు వారి గుర్తింపు కార్డును వినియోగించాల్సి ఉంటుంది. ఈ రిజిష్ట్రేషన్‌కు ఆధార్‌తో ఎటువంటి సంబంధం లేదని, ఆధార్‌ అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. సెల్ఫ్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలను వైద్య సిబ్బంది మరోమారు తనిఖీ చేస్తారు. వారు వ్యాక్సిన్‌ కేంద్రాలకు గుర్తింపు కార్డుతోనే వెళ్లాల్సి ఉంటుంది. టీకా కోసం స్పాట్‌ సెల్ఫ్‌ రిజిష్ట్రేషన్‌కు అనుమతించమని కేంద్రం ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలకు తెలిపింది.
 
ఒక్కో వ్యాక్సిన్‌ కేంద్రంలో 100 మందికి కరోనా టీకా ఇవ్వనున్నారు. కేంద్రంలో రెండు బృందాలు పనిజేస్తాయి. ఒక బృందంటీకా కోసం వచ్చిన వివరాలను చెక్‌ చేస్తుంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటరో కాదో పరిశీలించినట్లుగానే.. ఈ టీకా కేంద్రంలో వచ్చిన వారి వివరాలను తమ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూస్తారు.

రిజిష్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలను, వారి ఐడీ కార్డులను పరిశీలిస్తారు. మరో బృందంలో.. ఐదుగురు వైద్య సిబ్బంది ఉంటారు. ఒక వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌తో పాటు డాక్టర్‌, నర్స్‌, ఎఎన్‌ఎమ్‌, సహాయకుడు ఉంటారు. టీకా వేసే బృందం ఇది. టీకా నిల్వ కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దే చిన్నపాటి మూవింగ్‌ ఫ్రీజర్స్‌ను ఉంచుతారు.
 
టీకా తీసుకున్నాక..
కరోనా టీకా తీసుకున్నవారు తర్వాత అరగంట పాటు ఆ కేంద్రం వద్దనే ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా టీకాను తొలిసారి ఇస్తున్న నేపథ్యంలో దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఏ సమస్యలూ లేవని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

కాగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సెల్‌ఫోన్‌కు ఒక మేసేజ్‌ వస్తుంది. అందులో ఉండే లింకుపై క్లిక్‌ చేస్తే తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా వివరాలుంటాయి. మూడు వారాల తర్వాత రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ మేసేజ్‌ వస్తుంది. అందులో పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఉంటుంది. రెండో డోసు అనంతరం  వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరణ పత్రాన్నిస్తుంది.
 
ఒకసారి ఇచ్చిన డోసే..
కరోనా టీకా తీసుకున్న వారు తొలుత ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ తీసుకున్నారో మూడు వారాల తర్వాత అదే కంపెనీ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఒక కంపెనీ టీకా, రెండోసారి మరో కంపెనీ టీకా తీసుకుంటామంటే కుదరదు. ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్‌ మైనస్‌ 2, మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉండేదే వస్తుందని అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు