ఆర్థిక ఎమెర్జెన్సీ దిశగా దేశం?

మంగళవారం, 24 మార్చి 2020 (04:33 IST)
కరోనా భారత్ ను కష్టాల్లోకి నెట్టేస్తోందా? కరోనా కారణంగా అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఎమెర్జెన్సీని విధించనుందా? ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అవకాశం కల్పించే ఆర్టికల్ 360ని ఆశ్రయించడమే మార్గమని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోందా?

ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎవరూ ఇప్పటి వరకు ఆర్టికల్ 360 ఊసెత్తకపోయినప్పటికీ... కొందరు నేతల వ్యాఖ్యలతో దీనిపై విశేష ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో ఇది ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది.

‘‘ఇక ఇప్పుడు దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించడం అనివార్యమా? ప్రభుత్వం దీనిపై సందేహాలను నివృత్తి చేయాలి..’’ అని స్వామి ఇటీవల ట్వీట్ చేశారు. అటు స్వామి వ్యాఖ్యలతో పాటు.. భారత సెక్యురిటీ మార్కెట్లు ఇవాళ ఘోరంగా పతనం కావడంతో ఇక ఆర్టికల్ 360 విధించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 3,934 పాయింట్లు పతనమైంది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి 25,981 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ సైతం 76 పైసలకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించడమే దీనికి  కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
ఆర్టికల్ 360 అంటే ఏమిటి?
ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చే చట్టమే ఆర్టికల్ 360. దీని ద్వారా రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా ఈ చట్టంతో కేంద్రానికి అధికారం కల్పిస్తుంది.

‘‘దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి  భావిస్తే.. అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీన్ని అమల్లోకి తేవచ్చు..’’ అని ఈ చట్టంలోని 1వ ప్రకరణం చెబుతోంది.

ఒక వేళ ఆర్టికల్ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 2 నెలలకు మించి పొడిగిస్తే.. దీన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు